తెలుగు భాషా గొప్పతనం

Digital Marketing Agency

తెలుగు భాషా గొప్పతనం

మాతృభాష ఏదైనా అది తల్లి తో సమానం.  మనం తల్లిని ఎంత గౌరవము ఇస్తామో, మన మాతృభాష  ని కూడా అంతే  గౌరవించాలి.  అది తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హింది  కావచ్చు. ఎవరి భాష వారికి అది గొప్పది.  మనం తెలుగు భాష తక్కువ అని  అనుకో కూడదు.  తెలుగు భాష కి చాలా చరిత్ర ఉంది.  తెలుగు భాష  సామాన్యమైన ప్రజల కోసం క్లిష్టమైన సంస్కృతం నుండి ఆవిర్భవించింది.   అందులో ఎందరో కవులు, రచయితలు  గ్రంధ కర్తలు చాలా చాలా రచనలు చేశారు.

   మన తెలుగు లో 56 అక్షరాలు ఉన్నాయి. అంటే ఇంగ్లీష్ కన్నా ఎక్కువ శబ్దాలు, పదాలు మనం తెలుగు లో మాట్లాడొచ్చు.  తెలుగు అక్షరాలు పలకడంలో మనకు ఇంగ్లీషు లో ల తికమకలు ఉండవు.  మనలోపలి అనుభూతులను పైకి చెప్పడానికి తెలుగు భాషలో అన్నీ సాధనాలు ఉన్నాయి.  పలికే విధానం బట్టి కూడా మనం  ఎదుటివారికి మన భావం తెలియచెప్పగలగడం తెలుగు లో ప్రత్యేకం.  ఏదైనా విషయం తెలుగులో ఇంగ్లీషు కన్నా క్లుప్తంగా ను , ఇంగ్లీషు కన్నా ఎక్కువ భావసమ్మితం  గాను మనం తెలుగులో చెప్పగలం.

   మన తెలుగు భాష విజయనగర సామ్రాజ్యం చక్రవర్తి సామ్రాట్టు శ్రీ కృష్ణదేవరాయలు కాలం లో చాలా అభివృద్ధి చెందినది.  తెలుగు భాష లోకి ఎన్నో గ్రంధాలు అనువదింపబడ్డాయి. నన్నయ తెలుగు లో మొదటి కావ్యం రచించారు.  అందుకని ఆయనని ఆదికవి అంటారు. కృష్ణదేవరాయల సభలో అష్టదిగ్గజాలు  అని ఎనిమిది కవులుండేవారు . అందులో వికట కవి తెనాలి రామకృష్ణ, నంది తిమ్మన మొదలైన కవులుండే వారు. శ్రీ రామదాసు కృతులు , శ్రీ త్యాగరాజ కృతులు , జయదేవుని అష్టపదాలు ఇలా ఎన్నో గొప్ప రచనలు తెలుగు లో మన కు కనిపిస్తాయి. శ్రీ బమ్మెర పోతన భాగవతం చదువుతుంటే ఎవరిలోనైనా భక్తి భావం పొంగి పొరలుతుంది.  వేమన శతకం (పద్యాలు) పామరులకు నీతి బోధిస్తుంది.  శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి తెలుగు లోనే చెప్పిన మాటలు ఎన్నో మహత్వపూర్ణమైనవి.  నండూరి సుబ్బారావు గారి ఎంకి పాటలు ఎంతో ఆదరాన్ని పొందాయి.  శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల కీర్తనలు విని పరవశించని వారు ఎవరూ ఉండరు అంటే అతిశయోక్తి లేదు.

మాతృ భాషే అన్నింటికీ మూలం

భావాలను పరస్పరం ఒకరికొకరు పంచుకోవాలంటే మాతృ భాషతోనే సాధ్యం. అనురాగాలు, మమకారాలు కేవలం మాతృ భాషతోనే వ్యక్తీకరించడం సాధ్యపడుతుంది. అలా బంధాలు, అనుబంధాలను బలపరిచేదిగా మాతృ భాష నిలుస్తుంది. చర్చలు, సమావేశాల్లో పర భాషలో మాట్లాడినప్పుడు అర్థాలు అనేకం మారుతాయి. ఒకానొక సమయంలో అవి పెడార్థాలుగా కూడా వినిపిస్తాయి. అప్పుడు అనర్థాలకు దారితీస్తాయి. అందుకే మాతృ భాష అన్నిటికీ మూలం. దీన్ని మరిస్తే మాతృ మూర్తిని మరిచినట్లే. కోట్లాది మంది మాట్లాడుతున్న తెలుగు భాషను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.

   తెలుగు ప్రజలు ఆదినుంచి శాంతస్వభావులు, విశాల హృదయులు మరి పరభాషలను ఎంతో గౌరవిస్తారు.  వేరే వారి సంస్కృతి, భాషలను మన తెలుగులో వెంటవెంటనే కలిపేసుకుంటాం.  ఇంగ్లీషువాళ్లు తెలుగుని ఇటాలియన్ (Italian of the East) ఆఫ్ ద ఈస్ట్ అని అన్నారు.  అంటే అంత తీయని , చెవులకు ఇంపైన భాష అన్నమాట.  తెలుగు భాష కి, హిందికి, ఫ్రెంచ్ భాషకి, ఇటాలియన్ కి ఎన్నో పోలికలున్నాయి.  గవర్నమెంటు పనులకు, కోర్టు వ్యవహారాలకు, వైద్య విద్య నేర్చుకోడానికి, ఇంజనీరింగు నేర్చుకోడానికి, భౌతిక రసాయన శాస్త్రం లాంటివి నేర్చుకోడానికి, మరి  అంతర్జాతీయం గాను, భారత దేశం లో అన్య భాషా పరులతో కలిసి సంభాషించడానికి ఇంగ్లీష్ వాడకం లో ఉండడంవల్ల తెలుగు భాషలో ఆసక్తి తగ్గిపోయింది.  తెలుగు పద్యాలలో ఉన్న వైవిధ్యం సంస్కృతం లో ఉన్నంత గొప్పగా ఉంటుంది. ఎన్నో రకాలుగా శ్రోతలను రంజింప చేస్తాయి.

చక్కని పలుకుబడులకు, నుడికారములకు తెలుగు బాషయే పుట్టినిల్లు ”. చక్కని కవితలల్లిక లో జిగిబిగిని ప్రదర్శించిన నేర్పు ఈ బాషలోనే వీలైనది. అంతేగాక, అనేక బాషలు ఈ బాషలో చోటు చేసుకున్నాయి. ఎప్పుడైనా ఒక బాష  గొప్పతనం అన్ని బాషలూ నేర్చినగానీ తెలియదు. సంస్కృతము, తమిళము, పారసి మున్నగు బాషలు తెలిసిన రాయలు “దేశబాషలందు  తెలుగులెస్స” అనుట ఆశ్చర్యం గాదు. బ్రౌనుదొర కూడాఈ బాషను గూర్చి వేనోళ్ల పొగుడుట మన తెలుగు వారి, తెలుగు బాష యెక్క గౌరవము.

మాతృ భాషలోనే విద్యా బోధన జరగాలి

ఒకటి నుంచి పదో తరగతి వరకు మాతృ భాషలోనే విద్యా బోధన జరగాలి. మన పక్క రాష్ట్రం తమిళనాడులో ఇంటర్‌ వరకు తమిళంలో నిర్బంధంగానే భోధిస్తారు. పదో తరగతి వరకు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా వాళ్ళ మాతృ భాషలోనే విద్యా బోధన ఉంటుంది. మాతృ భాష తెలుగును కాపాడుకుంటే మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకున్నట్లే. మాతృ భాషను చంపుకొని మనం బతికున్నా వ్యర్థమే. తెలుగు మాద్యమంలో చదువుకున్న విద్యార్థులకు 20 శాతం ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలి. అన్ని కార్యాలయాలు, వాణిజ్య సముదాయాలపేర్లను తెలుగులోనే ఉండేటట్లు చర్యలు తీసుకోవాలి. మాతృ భాషాభివృద్ధికి కృషి చేస్తున్న వారికి, సాహిత్యకారులకు ప్రోత్సాహాన్నందించాలి.